బొత్స ఫ్యామిలీ ఆస్తులు రూ.19.76 కోట్లు... వంగా గీత ఆస్తులు రూ.29.15 కోట్లు

వరుణ్

మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (11:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు తమతమ ఆస్తుల వివరాలను బహిర్గతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంత్రబాబు నాయుడు ఇలా ప్రతి ఒక్కరూ ఆస్తులు వివరాలను వెల్లడించారు. ఆ కోవలోనే రాష్ట్ర విద్యా మంత్రి, విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ, పిఠాపురం వైకాపా అభ్యర్థి వంగా గీతలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ మేరకు వారు సమర్పించిన ఎన్నికల నామినేషన్‌తో పాటు తమ ఆస్తుల వివరాలకు సంబంధించి అఫిడవిట్‌లను సమర్పించారు. 
 
ఈ అఫిడవిట్లను పరిశీలిస్తే, మంత్రి బొత్స సత్తిబాబు కుటుంబ ఆస్తులు రూ.19.76 కోట్లుగా ఉన్నాయి. విశాఖ లోక్‌‍సభకు పోటీ చేస్తున్న బొత్స భార్య బొత్స ఝూన్సీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తమ కుటుంబానికి రూ.19.76 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు. బొత్స ఝూన్సీ వద్ద రూ.4.5 లక్షలు, బొత్స సత్యనారాయణ వద్ద రూ.4.75 లక్షల నగదు ఉందన్నారు. 
 
ఝూన్సీ వద్ద 325 తులాలు, సత్యనారాయణ వద్ద 31 తులాల బంగారం ఉంది. చరాస్తులు ఝూన్సీ వద్ద రూ.4.75 కోట్లు, ఆమె భర్త వద్ద రూ.3.78 కోట్లు ఉన్నాయి. స్థిరాస్తుల విలువ(భూమి, భవనాలు) ఝూన్సీ పేరిట రూ.4.46 కోట్లు, ఆమె భర్త పేరిట రూ.6.75 కోట్లు ఉన్నట్టు తెలిపారు. ఝూన్సీకి రూ.2.32 కోట్లు, సత్యనారాయణకు రూ.1.92 కోట్ల అప్పులు ఉన్నాయి.
 
అలాగే, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత తన వద్ద రూ.29.15 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు. 2019లో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే సమయానికి, ఇప్పటికి ఆస్తులు రూ.9 కోట్ల మేరకు పెరిగాయి. తాజా అఫిడవిట్‌లో తనవద్ద రూ.20 లక్షల నగదు ఉండగా, ఐదు బ్యాంకు ఖాతాల్లో రూ.18.80 లక్షలు, ఆమె భర్త కాశీ విశ్వనాథ్ వద్ద రూ.8.50 లక్షల నగదు ఉందని తెలిపారు. క్వాలిస్, ఇన్నోవా కార్లు, హీరోహోండా సీబీజెడ్ మోటార్ బైక్ ఉందని పేర్కొన్నారు. గీత వద్ద 2 కిలోల బంగారం ఉండగా, భర్త వద్ద 300 గ్రాముల బంగారం ఉందని తెలిపారు. భూములు, ఇళ్లస్థలాలు, అపార్ట్ మెంట్ ప్లాట్లు కలిపి స్థిరాస్తుల విలువ రూ.13.11 కోట్లు ఉందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు