పక్కలో బల్లెం. ఈ సామెత మనందరికీ తెలుసు. ఇప్పుడు నగరి ఎమ్మెల్యే రోజా పరిస్థితి అలా వుందని అంటున్నారు. నగరిలో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆమెతో సీనియర్ వైసిపి నాయకులు కలిసి రావడం లేదని అంటున్నారు. ప్రస్తుతం రోజా వెంట పర్యటనకు ఇప్పటివరకూ ఎవరికీ తెలియని నాయకులు తిరుగుతున్నారట. ఆమె అలా వస్తున్న కొత్త ముఖాలను వెంటబెట్టుకుని నగరిలోని వీధివీధికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఐతే వైసిపికి చెందిన కీలక నేతలు మాత్రం రోజా వస్తుందని తెలిస్తే... అక్కడి నుంచి జారుకుంటున్నారట. ఎమ్మెల్యేగా వున్న ఈ ఐదేళ్ల కాలంలో తమను ఎంతమాత్రం పట్టించుకోలేదని ఒక వర్గం ఆరోపిస్తుంది. ముఖ్యంగా పుత్తూరు, వడమాలపేట, నగరి, విజయపురం, నిండ్ర మండలాలకు చెందిన వైసిపి నాయకులు రోజాకి ఏమాత్రం సహకరించడంలేదని సమాచారం. ఆమె వస్తుందని తెలియగానే ముఖం చాటేస్తున్నారట.
మరోవైపు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ నగరి నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటికే ఒకసారి చుట్టేసారు. మరోసారి ఆయన పర్యటనలో దూసుకుని వెళ్తున్నారు. ఆయన వెంట తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు మద్దతు పలుకుతూ వెళ్తుంటే, రోజా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా వున్నదట. మరి ఎన్నికలకు మరో 12 రోజుల సమయమే మిగిలి వుంది. ఈలోపుగా ఆమె ఏం చేయగలరో చూడాలి.