ఎమ్మెల్యే రామారావు ఆమరణ దీక్ష భగ్నం

తనపై మోపిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టీవీ.రామారావు సోమవారం చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

తనపై అక్రమంగా కేసులు పెట్టి, ప్రభుత్వం వేధిస్తున్నదని, తనపై కేసులను ఎత్తివేయాలంటూ రామారావు సోమవారం నాడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రామారావుకు మద్దతుగా మరికొందరు తెలుగుదేశం పార్టీ నేతలు ఈ దీక్షకు పూనుకున్నారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో తీవ్రంగా ట్రాఫిక్‌కు స్తంభించిపోయింది.

దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తెదేపా నేతలు, ఎమ్మెల్యే రామారావు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రామారావును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

రామారావును పోలీసులు అరెస్ట్ చేయడంతో తెదేపా నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వైఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు తనకు న్యాయం జరిగే వరకూ, తనపై అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకునే వరకూ దీక్షను విరమించేది లేదంటూ రామారావు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి