ఓటర్ల నమోదు గడువు పెంచండి: అరవింద్

గురువారం, 10 జులై 2008 (18:06 IST)
రాష్ట్రంలో ఓటర్ల నమోదు గడువును పొడిగించాలని సినీనిర్మాత, చిరంజీవి బావమరది, అల్లు అరవింద్ కోరారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి ఐ.వి.సుబ్బారావును కలుకుని వినతిపత్రం సమర్పించారు. చిరంజీవి పార్టీ స్థాపనకు సర్వంసిద్దం చేసుకున్న తరుణంలో అరవింద్ ఎన్నికల అధికారిని కలుసుకోవడం గమనార్హం.

అరవింద్ ఎన్నికల అధికారి సుబ్బారావుతో ఏకాంతంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... తాము జరిపిన సర్వేలో గత 2004 ఏడాదిలో మేజర్లుగా మారిన యువతీ యువకుల్లో 20 శాతం మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోలేదని తెలిసిందని ఆయన తెలిపారు.

కాగా ప్రభుత్వం ఈ నెల 14 తేదీతో నమోదు కార్యక్రమం పూర్తికానుందని చెప్పారు. అందువల్ల ఎన్నికల గడువును పొడిగించాల్సిందిగా 'వారధి' సేవాసంస్థ తమ దృష్టికి తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి సానుకూలంగానే స్పందించారని ఆయన తెలిపారు. యువతీ యువకులు పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేందుకు ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి