చేరితే దేవుడు దయవల్ల లేకపోతే వారి ఖర్మ అని వదిలేస్తున్నారు.. బాబు ధ్వజం

సోమవారం, 30 జులై 2012 (16:45 IST)
WD
రైలు ప్రయాణించేవారు గమ్య స్థానాలకు చేరితే దేవుడు దయవల్ల.. లేకపోతే వారి ఖర్మ అన్నట్లుగా రైల్వే శాఖ రైలు ప్రయాణికుల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తోందని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రైలు ప్రయాణమంటేనే భయపడే స్థితికి రైల్వే శాఖ తీసుకు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా రైలు దుర్ఘటన బోగీని పరీశీలించిన చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ రైళ్లు చార్జీలు, ఇతర చార్జీలు పెంచుకుంటూ పోతుందే కానీ ప్రయాణికుల భద్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 45 శాతం కూడా ఖర్చు చేయడం లేదంటే ప్రయాణికుల ప్రాణాల పట్ల రైల్వే శాఖకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుందన్నారు.

ప్రయాణాలన్నిటిలో రైలు ప్రయాణం ఎంతో సురక్షితమైనదని ప్రజలు విశ్వసిస్తారనీ, ఇప్పుడు ఆ నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో దేశంలో వివిధ రైలు ప్రమాదాల కారణంగా 992 మంది చనిపోయారనీ, ఈ గణాంకాలే కేంద్రం, రైల్వే శాఖ అసమర్థతను తెలియజేస్తాయన్నారు.

రైల్వే శాఖలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేసే దిశగా ఆ శాఖ చర్యలు తీసుకోవడం లేదన్నారు. 4 బోగీలకు ఒక టీసీని పెడుతున్నారనీ, దీంతో ఏ బోగీలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితి నెలకొన్నదన్నారు. ప్రయాణికుల నుంచి వందలకు వందల రూపాయలు కొల్లగొట్టే రైల్వే శాఖ ప్రయాణికుల ప్రాణాలకు మాత్రం భరోసా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

ప్రమాదం జరిగిన స్థలానికి మేమంతా రాగలిగినా ప్రమాద కారణాన్ని వెలికి తీయాల్సిన ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం ఇంతవరకూ రాలేదంటే ఇంతకన్నా చేతకాని ప్రభుత్వం ఎక్కడు ఉంటుందంటూ ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 12 గంటలు దాటినా ఇంకా ఫోరెన్సిక్ నిపుణులు రాకపోవడాన్ని చూస్తుంటే, ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వాలు ఇస్తున్న విలువ ఏమిటో అర్థమవుతుందన్నారు.

ఇప్పటికయినా రైల్వేశాఖ మొద్దు నిద్ర వీడి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదంలో చనిపోయినవారందరికీ రూ. 10 లక్షల పరిహారం చెల్లించి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి