తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు ప్రతిపక్ష నేత

కొవ్వూరు ఎమ్మెల్యే రామారావుపై అధికార పక్షం వేధింపులు మానుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్యేలను పోలీసులు అరెస్టు చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ధర్నాలో పాల్గొన్న పార్టీ నేతలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఇదిలా ఉంటే అంతకుముందు కొవ్వూరు ఎమ్మెల్యే రామారావుపై అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని ఈ రోజు ఉదయం టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

అయితే అందుకు వైఎస్‌ ఒప్పుకోకపోవడంతో ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీసు ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు బైఠాయించగా పోలీసులు వారిని అరెస్టు చేసి తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నేతల ధర్నాకు సీపీఐ కూడా మద్దతు ప్రకటించింది. పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ధర్నాలో చంద్రబాబుతోపాటు, సీపీఐ నేతలు చాడా వెంకటరెడ్డి, కె.రామకృష్ణలు కూడా పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి