నాగం జనార్ధన్ రెడ్డి : కేసీఆర్ నిక్కర్లు వేసుకునే టైమ్‌లో జైల్లో ఉన్నా!

మంగళవారం, 4 జూన్ 2013 (12:34 IST)
File
FILE
బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై మరోమారు నిప్పులు చెరిగారు. కేసీఆర్ నిక్కర్లు వేసుకునే రోజుల్లోనే తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళినట్టు ఆయన గుర్తు చేశారు. అంతేకానీ, 2001లోనే తెలంగాణ ఉద్యమం పుట్టిందని అనుకోవడం కేసీఆర్ భ్రమే అవుతుందన్నారు.

సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో బీజేపీ చీఫ్ రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా నాగం స్పందిస్తూ.. 15 లోక్‌సభ స్థానాలు లభిస్తే తెలంగాణ తెస్తామని టీఆర్‌ఎస్‌ అంటున్నదని, అది ఎలా సాధ్యమని నాగం జనార్థన్ రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టకోవాలన్నారు. 1969లో జరిగిన ఉద్యమం గురించి కేసీఆర్‌కు తెలుసా అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో కేసీఆల్ నిక్కర్లు వేసుకుంటుంటే.. తాను ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లినట్టు నాగం జనార్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా, 1982లో ఇదే నిజామ్‌ కాలేజీ మైదానంలో తాను టీడీపీ సభ్యత్వం తీసుకున్నానని, తర్వాతి ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఖతం చేశామన్నారు. ఇప్పుడు ఇదే మైదానంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్నానని, కాంగ్రెస్‌ను బతికి బట్టకట్టకుండా చేస్తానని నాగం శపథం చేశారు.

వెబ్దునియా పై చదవండి