మద్దూరువాగు ప్రమాదంలో 20 మంది మృత్యువాత

మంగళవారం, 12 ఆగస్టు 2008 (19:10 IST)
గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపాన మద్దూరు వాగు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరుకుంది. మద్దూరు వాగులో గల్లంతయిన వారిలో 13 మంది మృతదేహాలు లభించగా, మంగళవారం మరో ఏడు మృత దేహాలు లభించాయి. వరదల్లో మృత్యువాత పడిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ. రెండు లక్షలను ఏక్స్‌గ్రేషియాను ప్రకటించిన విషయం తెలిసిందే.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో, పలు ప్రాంతాలు జలమయమైన సంగతి విదితమే. భారీ వర్షాలకు విస్తారంగా వరదనీరు వచ్చి చేరడంతో చెరువులు, వాగులన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి. ఇందులో భాగంగా మద్దూరు వాగు కూడా విస్తృతంగా ప్రవహిస్తుండటంతో లారీ అదుపుతప్పి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.

ఈ ఇసుక లారీలో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది సురక్షితంగా బయటపడగా, మరో 20 మంది మృత్యువాత పడ్డారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ వెంకటేశం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఇసుక లారీలో ప్రయాణించిన ప్రయాణీకుల సంఖ్య ఖచ్చితంగా తెలియనందున ఇంకా గాలింపు చర్యలను చేపడుతున్నట్లు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి