చిన్నారులకు తల్లిపాలు అందించటంలో అలక్ష్యం వద్దు: డాక్టర్ కృతికా శుక్లా

గురువారం, 5 ఆగస్టు 2021 (20:20 IST)
చిన్నారులకు తల్లి పాలను మించిన పోషకాహారం లేదని, పిల్లలకు తల్లిపాలు అందించటంలో ఎటువంటి అలక్ష్యం కూడదని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. తల్లిపాలు పిల్లలలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయని, మరోవైపు తల్లికి కూడా పరోక్షంగా మేలు చేస్తాయని వివరించారు.
 
మహిళాభివృద్ది, శిశుసంక్షేమ శాఖ తరుపున రాష్ట్ర స్ధాయి తల్లిపాల వారోత్సవాలకు గుంటూరు బాలికాసదనంలో కృతికా శుక్లా నాంది పలికారు. ఈ సందర్భంగా బాలికా సదనంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాష్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. అక్కడి చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలను సంచాలకులు ఆవిష్కరించారు.
సామాజిక బాధ్యతలో భాగంగా వాష్ కాంప్లెక్స్, క్రీడా పరికరాల కోసం ఐటిసి దాదాపు 12.50 లక్షల రూపాయలను వెచ్చించింది.  ఈ కార్యక్రమం విభిన్న అంశాలకు వేదిక కాగా, తల్లిపాల ఆవశ్యకతను తెలియచేసేలా ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించి, తల్లిపాల పట్ల బాలింతలకు ఉన్న అవగాహన అధారంగా వారికి ప్రత్యేక పురస్కారాలు అందచేసారు.  
 
బాలికాసదనంలోని పిల్లలకు వారి వయస్సు ఆధారంగా ప్రి-ప్రైమరీ -1, ప్రీ-ప్రైమరీ -2 పుస్తకాలను డాక్టర్ కృతికా శుక్లా పంపిణీ చేసారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా పిడి మనోరంజని, సిడిపిఓ కృష్ణవేణి, గుంటూరు పట్టణ పర్యవేక్షకులు విజయ, ఇతర అధికారులు వీర స్వామి, గౌరీ నాయుడు,  అంగన్ వాడీ పనివారు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు