అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు పరిహారం.. 18 ఏళ్ల లోపు పిల్లలకే వర్తిస్తుంది..

బుధవారం, 2 జూన్ 2021 (10:56 IST)
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరిహారం నిబంధనల్లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఏదైనా ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే పరిహారం ఇవ్వాలన్న నిబంధనని తాజాగా ప్రభుత్వం తొలగించింది. బీమా ఉన్నా రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మరికొంతమంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ఉత్తర్వులు అమలు చేయాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కలెక్టర్లను ఆదేశించారు.
 
దేశాన్ని కరోనా వైరస్ మహమ్మరి గడగడలాడిస్తోంది. రాష్ట్రాన్ని సైతం వణికిస్తోంది. కరోనా బారిన పడి ఆస్పత్రల్లో చేరే పేద, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. ఈ మహమ్మారి కాటుకు అనేకమంది మృత్యువాత పడుతున్నారు. కొవిడ్‌ కారణంగా అనేకమంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. తల్లిదండ్రులను కోల్పోయి చిన్న వయసులోనే పిల్లలు అనాథలుగా మారాల్సిన దుస్థితి నెలకొంది. అలాంటి వారికి ఏపీ సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ పిల్లలకు రూ.10 లక్షలు సాయం చేయాలని నిర్ణయిచారు.
 
కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు మీద రూ.10 లక్షలు డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా పిల్లలకు అందజేస్తారు. వారికి 25ఏళ్లు వచ్చే వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేస్తారు. పిల్లలకు 25ఏళ్లు వచ్చిన తర్వాత ఈ డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. కాగా కరోనా కారణంగా పేరెంట్స్‌ను కోల్పోయిన 18ఏళ్ల లోపు పిల్లలకే ఈ బీమా వర్తిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు