తాజాగా ఏపీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి మొత్తం మూడు రాజధానులు ఉండబోతున్నాయని ప్రతిపాదన తీసుకురావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ వాతావరణం కంటే కూడా నెగిటివ్ వాతావరణమే ఎక్కువగా నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచింది. కేవలం ఈ ఆరు నెలలలోనే జగన్ పాలనపై ఏపీ ప్రజల్లో కొన్నింటిపై అసంతృప్తి నెలకొందన్న విషయం పలు సర్వేల్లో వెల్లడైంది. కొంతమంది జగన్ వీరాభిమానులు, వైసీపీ నేతల్లో తప్ప జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల్లో లొసుగులు ముందు చెప్పకుండా తర్వాత మాటలు తెలివిగా మార్చడాలు చాలానే జరిగాయంటున్నారు విశ్లేషకులు.
మరోవైపు ఇసుక కొరత, రైతుల సమస్యలు ఇలా ఎన్నో అంశాలు ఎన్నడూ లేని విధంగా పెను సమస్యల్లా మారాయి. ఇప్పుడు రాజధాని సమస్య వీటితో చేరింది. చాలామంది సామాన్య ప్రజానీకం జగన్ నిర్ణయంతో ఏకీభవించడం లేదన్న వాదనలు వినబడుతున్నాయి. జగన్ కానీ ఇదే పంథాను కొనసాగిస్తే ఆయన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.