కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఇపుడు సరికొత్త పల్లవిని అందుకున్నారు. ఏపీకి మూడు రాజధానులు రావొచ్చంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాజధాని అమరావతి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు నిరసలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చింతా మోహన్ రాజధానిపై స్పందించారు. తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇప్పటికి నాలుగు పర్యాయాలు మారిన రాజధాని, ఐదోసారి మారడం తథ్యమని అన్నారు.
ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో అమిత్ షా ఇంటి చుట్టూ తిరుగుతోందని, జగన్, చంద్రబాబు ఇద్దరూ అమిత్ షా గుప్పిట్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో, తిరుపతి నగరమే ఏపీకి సరైన రాజధాని అని, 1953లోనే తిరుపతిని రాజధాని చేయాలనుకున్నారని చింతా మోహన్ వెల్లడించారు.