ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అయితే, ఈ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సభ్యులు అనేక ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీస్తున్నారు. పలు సందర్భాల్లో సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తున్నారు. దీంతో ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
ఈ సస్పెన్షన్‌కు గురైన వారిలో బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల కిష్టప్ప, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులు ఉన్నారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారన్న ఏకైక కారణంతోనే వీరిని సస్పెండ్ చేశారు. ఈ ఐదుగురు సమావేశాలు ముగిసేంతవరకు సభకు హాజరుకాకుండా సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ, టీడీపీ సభ్యుల తీరు ఏమాత్రం బాగోలేదన్నారు. సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహించాలని ఆయన కోరారు. మరోవైపు, తమ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులను సస్పెండ్ చేయడంతో మిగిలిన టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు.