చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం రామాపురంకు చెందిన ఆదేశ్వర్, నందినీలకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరిది ప్రేమ వివాహమే. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గత రెండు నెలల నుంచి ఆర్థిక సమస్యల కారణంగా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే గత రెండురోజుల క్రితం భర్తతో గొడవ వేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది నందిని.
తన పెద్దకూతురిని తీసుకుని.. చిన్న కూతురిని ఇంట్లోనే వదిలి వెళ్ళిపోయింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు తన భార్యకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఆదేశ్వర్. అయితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య ఫోన్ తీయకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు ఆదేశ్వర్. ఇంట్లో పురుగులు మందు రెండేళ్ళ కుమార్తెకు తాగించాడు. ఆ చిన్నారి చనిపోయిన తరువాత తాను కూడా ఆ పురుగుల మందు తాగాడు.