మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి

గురువారం, 6 ఫిబ్రవరి 2020 (18:00 IST)
వ్యసనాలకు బానిసై మద్యం మత్తులో ఉన్న కుమారుడు నీళ్ల సీసాలో పురుగుల మందు కలుపుకొని తాగి చనిపోయాడు. ఆ విషాద వార్త విన్న తల్లి.. దాహం వేస్తుండటంతో వెనుకాముందూ చూసుకోకుండా అదే సీసాలోని నీళ్లను తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ములుగు మండలం పాల్‌సాబ్‌పల్లి గ్రామంలో జరిగింది. 
 
కాసర్ల రాజమల్లు.. కొమురమ్మ దంపతుల కుమారుడు రాజు మద్యం మత్తులో పురుగుల మందును కలుపుకుని తాగేశాడు. తండ్రి గమనించి ములుగు ఏరియా వైద్యశాలకు తరలించాడు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.
 
కూలీకి వెళ్లి  సాయంత్రం తిరిగొచ్చిన కొమురమ్మకు ఇరుగుపొరుగు విషయం చెప్పడంతో లబోదిబోమంటూ ఇంట్లోకి వెళ్లింది. ఆ పక్కనే ఉన్న సీసాలోని నీటిని తాగింది. తర్వాత వాసన వస్తుండటంతో పక్కనున్నవారికి చెప్పింది. ములుగు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆమె మృతి చెందింది. గంటల వ్యవధిలో తల్లీకొడుకు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు