గుడిలో ఒంటరిగా యువతి... మీదకు రాబోయాడు... కత్తితో ఏసేసింది...

మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:54 IST)
ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఓ యువతి ఒక యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. కాగా ఆత్మరక్షణ కోసమే దాడి చేసానని యువతి చెబుతోంది. అనంతపురం జిల్లా తనకల్లు మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కి చెందిన స్వప్న అనే యువతి సోమవారం నాడు అయ్యప్ప ఆలయంలో ఒంటరిగా కూర్చొని ఉండగా, ఆలయ పూజారి బంధువు మంజునాథ్ లైట్లు వేసేందుకు స్విచ్‌బోర్డ్ దగ్గరకు వెళ్లబోయాడు. 
 
మంజునాథ్ దురుద్దేశంలోనే తన దగ్గరకు వస్తున్నాడని భావించిన స్వప్న అతడి తలపై కత్తితో దాడి చేసింది. దాడిలో గాయపడిన మంజునాథ్‌ని స్థానికులు, బంధువులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతపురం ఆస్పత్రికి తరలించమని వైద్యులు సూచించారు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆమె ఆత్మరక్షణ కోసమే మంజునాథ్‌పై దాడి చేయాల్సి వచ్చిందని పోలీసులకు తెలిపింది. ఒంటరిగా ఉన్న తన దగ్గరకు మంజునాథ్ రావడాన్ని గమనించి, దగ్గరకు రావద్దని ఎంత వారించినా అతను అటే రావడం వల్ల భయంతోనే కత్తితో అతడిపై దాడి చేసానని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు