ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు కొనుగోలు చేయడంలో రూ.150 కోట్ల మేరకు అవినీతి జరిగినట్టు ఆధారాలు ఉన్నట్టు ఏసీబీ జాయింట్ డెరెక్టర్ రవి కుమార్ తెలిపారు. ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని శుక్రవారం వేకువజామున ఏసీబీ అరెస్టు చేసింది.
దీనిపై ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవి కుమార్ స్పందించారు. శుక్రవారం ఉదయం 7.30కి అచ్చెన్నాయుడుని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారితో పాటు సీకే రమేష్, జి.విజయకుమార్, డాక్టర్ జనార్దన్, ఈ. రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు.
కాగా, ఈఎస్‌ఐ స్కామ్‌లో సుమారు 150 కోట్లు అక్రమాలు జరిగాయని వివరించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించినట్టు నిర్ధారణ జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగినట్టు నిర్ధారణ జరిగినట్లు తెలిపారు. ఫేక్ ఇన్వాయిస్‌తో మందులు కొనుగోలుకు పాల్పడ్డారన్నారు.