ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జుడీషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ గా జస్టిస్ బి. శివశంకర్ రావు బాధ్యతలు చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎపి జుడీషియల్ ప్రివ్యూ కమిటీని ఏర్పాటు చేసి దానికి జస్టిస్ శివశంకర్ రావును అధ్యక్షునిగా నియమించగా శనివారం అమరావతి సచివాలయంలోని రెండవ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.
జస్టిస్ శివశంకర్ రావు తెలంగాణా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ శివశంకర్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రప్రధమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జుడీషియల్ ప్రివ్యూ కమిటీని ఏర్పాటు చేయడం దానికి తనను తొలి అధ్యక్షునిగా నియిమించి రాష్ట్రానికి సేవలందించే అవకాశం భగవంతుడు కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
అంతకు ముందు విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన వేదపడింతులు జస్టిస్ శివశంకర్ రావుకు ఆశిస్సులు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమీషనర్ సిద్ధార్ధ జైన్, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, న్యాయశాఖ కార్యదర్శి మనహోర్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.