కరోనా రోగుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే చర్యలు: జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

సోమవారం, 12 ఏప్రియల్ 2021 (22:18 IST)
అనంతపురం: జిల్లాలో కరోనా సోకిన రోగులకు అనుమతి లేకుండా వైద్య సేవలు అందించే ఆసుపత్రులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో కోవిడ్  బారినపడిన రోగులకు వైద్య సేవలు అందించేందుకు 8 ఆస్పత్రులను గుర్తించి అనుమతులు ఇచ్చామన్నారు .అందులో సుమారు 1003 పడకలు కోవిడ్ రోగుల కోసమే కేటాయించామన్నారు.
 
ఈ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుంటే రోగులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందిస్తారన్నారు. అందువల్ల జిల్లాలో ప్రజలు ఈ ఆసుపత్రులకే వెళ్లాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అనుమతులు లేకుండా కోవిడ్ రోగులకు వైద్యం చేయవద్దని ప్రైవేట్ ఆస్పత్రులను కోరుతూ, అందుకు విరుద్ధంగా వైద్యం అందిస్తే వారిపై అల్లోపతి హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అండ్ ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు .జిల్లాలో అనుమతి పొందిన ఆసుపత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.
 
1. జిల్లా హాస్పిటల్ ,హిందూపూర్ :70 పడకలు
2. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్,అనంతపురం: 165 పడకలు
3.ఏరియా హాస్పిటల్ ,కదిరి :50 పడకలు 
4.ఏరియా హాస్పిటల్, గుంటకల్: 60 పడకలు
5.సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అనంతపురం: 300 పడకలు.
6.ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ (ఆంకాలజీ): 266 పడకలు 
7.సవీర హాస్పిటల్ ,అనంతపురం :10 పడకలు
8. ఆర్ డి టి హాస్పిటల్ ,బత్తలపల్లి: 82 పడకలు
 
ఈ గుర్తింపు పొందిన ఆస్పత్రులు మినహా ఇతర ఆస్పత్రుల్లో కరోనా రోగికి వైద్యం అందించే అవకాశం లేదని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు