హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది... జనజీవనం అస్తవ్యస్తం

బుధవారం, 14 సెప్టెంబరు 2016 (10:53 IST)
హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి నగరం తడిసి ముద్దయింది. నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, మియాపూర్‌, చందానగర్‌, జీడిమెట్లలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 
 
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనానికి తోడైన అల్పపీడనం ఉత్తర కోస్తా వద్ద స్థిరంగా ఉండటంతో హైదరాబాద్ నగరంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో వాహనచోదకులు నానా ఇబ్బందులు పడ్డారు. వర్ష బీభత్సానికి కాచిగూడలోని మేదరబస్తీలో ఓ పురాతన భవంతి కూలింది. దీనికిముందు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఓ మట్టిబెడ్డ మీదపడటంతో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు కుటుంబసభ్యులు బయటకు పరుగుతీశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది.
 
హైదర్‌గూడలోని ఓ పాత భవనంలో కొంత భాగం కూలిపోయింది. ఇక పాతబస్తీ, బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లో పాత ప్రహరీలు కూలాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. గణేష్ నిమజ్జనానికి వెళ్తున్న భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి