మంగళగిరిలో ఎయిమ్స్ సేవలు.. రూ.10కే వైద్యం

ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (11:58 IST)
గుంటూరు - విజయవాడ ప్రాంతాల మధ్య ఉన్న మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ కేవలం పది రూపాయలకే వైద్యం పొందవచ్చు. మొన్నటివరకు ఔట్ పేషెంట్ వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇపుడు ఇన్‌పేషెంట్ వైద్య సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి.
 
రాష్ట్ర విభజన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా విజయవాడ-గుంటూరుకు మధ్యలోని మంగళగిరిలో ఏర్పాటైంది. తొలుత ఔట్‌ పేషంట్‌ సేవలతో ప్రారంభించి.. ఇప్పుడు ఇన్‌పేషంటు సేవలు కూడా అందిస్తోంది. ప్రముఖ వైద్యులు, వైద్య విద్యార్థులు.. ఆధునిక వైద్య పరికరాలతో ఇక్కడ ఉన్నతమైన సేవలు అందిస్తున్నారు. పేదలకు కూడా అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరలతో.. ఖరీదైన వైద్య సేవలు... వైద్య పరీక్షలు చేస్తున్నారు.
 
ఈ ఎయిమ్స్‌లో వైద్యసేవలు ప్రస్తుతానికి రెండు విధాలుగా అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రికి నేరుగా వచ్చి 10 రూపాయల కన్సల్టేషన్‌ ఫీజుతో వైద్యులను కలిసి సేవలు పొందవచ్చు. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చేయించుకుని టోకెన్‌ తీసుకున్న రోగులు సాయంకాలం నాలుగు గంటల వరకు వైద్య సేవలను పొందవచ్చు. 
 
వారంలో ఒక్క శనివారం మాత్రం ఓపీ రిజిస్ట్రేషన్‌ ఉదయం 12గంటల వరకే ఉంటుంది. ఆదివారం సెలవు. ఇక రెండో రకం సేవల కింద టెలిమెడిసన్‌ విధానం అందుబాటులో ఉంది. ఈ విధానంలో రోగులు 85230 07940 లేదా 94930 65718 నంబర్లకు ఉదయం 8:30 నుంచి 11 గంటల మధ్య ఫోన్‌చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వీరికి ఉదయం 11 గంటల నుంచి వైద్యులే ఫోన్‌చేసి వైద్య సలహాలు అందిస్తారు. ఇది పూర్తిగా ఉచితం. 
 
ఈ ఆస్పత్రిలో వైద్య పరీక్షల ఫీజులను ఇలా వసూలు చేస్తారు. కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ రూ.135, ఫాస్టింగ్‌ అండ్‌ ర్యాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ రూ.24+24, లివర్‌ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ రూ.225, కిడ్నీ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ రూ.225, లిపిడ్‌ ప్రొఫైల్‌ రూ.200, థైరాయిడ్‌ ప్రొఫైల్‌ రూ.200, ఈసీజీ రూ.50, ఛాతి ఎక్స్‌రే రూ.60, మామోగ్రఫీ రూ.630, అల్‌ట్రాసోనోగ్రఫీ రూ.323, యూరిన్‌ ఎనాలిసిస్‌ రూ.35, హెచ్‌ఐవీ రాపిడ్‌ టెస్ట్‌ రూ.150, హెచ్‌బియస్‌ ఏజీ రాపిడ్‌ టెస్ట్‌ రూ.28 చొప్పున వసూలు చేస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు