కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా, పలు రకాలైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో నాలుగు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే, వీటిలో ఏ వ్యాక్సిన్ కావాలో నిర్ణయించుకునే తీసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ చీఫ్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు.
వ్యాక్సిన్ డ్రైవ్‌ను ఇండియాలో మరింత వేగవంతం చేయాలని ఇప్పటికే నిర్ణయించామని పేర్కొన్నా ఆయన, ప్రైవేటు ఆసుపత్రుల్లో వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, ప్రభుత్వం మాత్రం ఒకటే వ్యాక్సిన్ ను లబ్దిదారులకు అందిస్తుందని తెలిపారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించి, మరిన్ని టీకా వేరియంట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత, పరోక్షంగానైనా తమకు నచ్చిన కంపెనీకి చెందిన టీకాను తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ఒక వ్యాక్సిన్ కేంద్రంలో ఒకే వేరియంట్ లభిస్తుందని, కావాల్సిన వ్యాక్సిన్ ఎక్కడుందో తెలుసుకుని వెళ్లాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలావుండగా, ఇప్పటివరకూ ఇండియాలో సీరమ్ తయారు చేసిన కొవీషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌ను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మొత్తం వ్యాక్సిన్ పొందిన వారిలో కేవలం 11 శాతంగా మాత్రమే కొవాగ్జిన్ తీసుకున్న వారు ఉన్నారు. ఈ శాతాన్ని మరింతగా పెంచుతామని, కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు వెల్లడికాగానే మరిన్ని డోస్ లు అందుబాటులోకి వస్తాయని గులేరియా వ్యాఖ్యానించారు.