మంగళవారం తెల్లవారుజామున 5.50 గంటల సమయానికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం 9 రౌండ్లు పూర్తయ్యే సరికి సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ రావుపై 82,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 2,41,873 ఓట్లు పోలయ్యాయి. ఈ గెలుపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మపై ఆయన గెలుపొందారు. ఇకపోతే, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ముగిసే సమయానికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 28 వేల ఓట్లకుగాను ఆయన 16520 ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు 5818 ఓట్లు వచ్చాయి.