అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో నేలలు బహుళ అంతస్తులకు పనికి రావా? తాత్కాలిక సచివాలయం కడుతున్న వెలగపూడిలో నేల కుంగిపోతోందా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం పనుల్లో కలకలం రేగింది. సెక్రటరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కొంతమేర నేల కుంగిపోయినట్లు తెలుస్తోంది. మూడు అడుగులు వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతినడంతో, అక్కడ పనిచేస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యోగులను హైదరాబాదు నుంచి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం వెలగపూడిలో హుటాహుటిన తాత్కాలిక సచివాలయం నిర్మాణం ప్రారంభించింది. ఈ భవనాలను ఎల్.ఎం.టి., షాపుర్ జి-పల్లోంజి సంస్థలు నిర్మిస్తున్నాయి. తొలుత ఇక్కడ బహుళ అంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించాలని భావించారు. కానీ, తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకుని జీ ప్లస్ వన్ నిర్మాణాలు చేపట్టారు. మొత్తం ఆరు బ్లాకులుగా ఆరు లక్షల చదరపు గజాలతో ఆరు భవనాలు నిర్మిస్తున్నారు. 201 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేస్తున్నారు.
అసెంబ్లీ హాలు కూడా ఇక్కడ కడుతున్నారు. అయితే, పల్లోంజి నిర్మిస్తున్న మొదటి రెండు బ్లాకుల వద్ద భూమి కుంగి నిర్మాణంలో పగుళ్ళు వచ్చాయని వదంతులు వెల్లువెత్తాయి. ఇక్కడ భూమి బహుళ అంతస్తులకు సహకరించదని పేర్కొంటున్నారు. ఇలాంటి స్థితిలో బహుళ అంతస్తులను విరమించుకుని, తొలుత జీ ప్లస్ వన్ కడుతున్నారని చెపుతున్నారు.
వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం రెండో బ్లాక్ కుంగింది అన్నది వాస్తవం కాదని సీఆర్డిఎ ఒక ప్రకటనలో ఖండించింది. సాయిల్ టెస్ట్ చేశాకే నిర్మాణాలు... చేపట్టారని, రెండో బ్లాక్‌లో ఫ్లోరింగ్ వేసే ముందు సర్వీస్ డక్ట్ నిర్మాణం చేపడతారని స్పష్టం చేసింది. సిఆర్డిఎ అధికారులు నిర్మాణాలను ఎప్పటికపుడు పరిశీలస్తున్నారని, ఎక్కడా భూమి కుంగడం లేదని పేర్కొంది.