అమ‌రావ‌తిలో ఈ నిర్మాణం అదుర్స్... 153 ఏళ్ళ కింద‌ట నిర్మించిన బావి ఇది...

మంగళవారం, 21 జూన్ 2016 (14:31 IST)
అమ‌రావ‌తి: మ‌న ఇంజ‌నీర్లు ఇపుడు మ‌ల్టీస్టోరీడ్ భ‌వ‌నాలు నిర్మిస్తున్నారు. ఆధునిక యంత్రాలు, ర‌క‌ర‌కాల సిమెంట్‌ మిశ్రమాలు అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత కాలంలోనూ, కట్టడాల నిర్మాణానికి ఆపసోపాలు పడుతున్నారు. కానీ అమ‌రావ‌తిలో నాడు నిర్మించిన ఈ బావిని చూస్తే, ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌ల‌ుగ‌క‌మాన‌దు. 153 ఏళ్ల కిందట (1863లో) కేవలం రాయిపై రాయిని పేర్చి అద్భుతంగా బావిని నిర్మించి ఔరా అనిపించారు వెనుకటి నిర్మాణదారులు. అమరావతి మండలంలోని మల్లాదిలో బత్తినేని వారి బావి పేరుతో ఈ అద్భుత నిర్మాణం ఉంది. ప్రస్తుతం దీనికి పూడిక తీసే  పనులు జరుగుతున్నాయి. 
 
బావిలోని నీటిని మొత్తాన్ని తోడి బయటకు పోయడంతో అత్యద్భుతమైన రాతి కట్టడం రూపురేఖలు ఇలా బయటపడ్డాయి. పొలం పనులకు వెళ్లే రైతులు, రైతుకూలీలు, పశుపక్ష్యాదుల దాహార్తిని తీర్చేందుకు ఎక్కడా చుక్కనీరు దొరకని ప్రదేశంలో బత్తినేని రామయ్య అనే దాత 80 అడుగుల లోతున ఈ అద్భుత జలసౌధాన్ని అప్ప‌ట్లోనే నిర్మింపజేశాడు. బావి ఎంత తవ్వినా నీళ్లు పడకపోవడంతో ప్రధాన బావిలో మళ్లీ పిల్లబావి తవ్వించి పాతాళ గంగను ఆ అపర భగీరథుడు పైకి రప్పించాడు. 
 
నాటికీ నేటికీ ఈ బావి అన్నదాతల దాహార్తిని తీర్చడంతోపాటు, వారికి పురుగు మందుల పిచికారీ, మొక్కలు నాటుకోవడం వంటి పనులకు ఉపయోగపడుతోంది. ఈ బావికి 1983లో తొలిసారిగా పూడిక తీయించిన రామయ్య వారసులు, తిరిగి ప్రస్తుతం పూడిక తీయిస్తున్నారు. తమ వెనుకటి పెద్దలు చేయించిన ధార్మిక కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేలా ఉదారత చూపుతున్నారు. నాటి అమ‌రావ‌తి ప్రాశ‌స్త్యాన్ని ఈ బావి కూడా ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది.

వెబ్దునియా పై చదవండి