ప్రత్యేక హోదా ఇవ్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ చెంప పైన లాగి కొట్టిందని వైకాపా నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అలాంటి బీజేపీతో ఇంకా సిగ్గులేకుండా కేంద్రంలో ఎలా కొనసాగుతారని అంబటి మండిపడ్డారు. ప్రజల్ని మోసం చేయడాన్ని ఇప్పటికైనా చంద్రబాబు మానుకోవాలని, చంద్రబాబు నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఏపీకి స్పెషల్ స్టేటస్‌పై తమ వైఖరి ఏంటన్నది బీజేపీ రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేసిందని ఇక సీఎం చంద్రబాబే మాట్లాడాలని డిమాండ్ చేశారు. లక్షా 43 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసినట్లు బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారని.. ఆ డబ్బులన్నీ ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేసారు.
లక్షా 43 వేల కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని నిలదీశారు. తాము ఓ అవసరం నిమిత్తం నిధులు పంపిస్తే.. ఏపీ ప్రభుత్వం మరో దానికి ఉపయోగిస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారని, అలా చెప్పినప్పుడు చంద్రబాబుకు సిగ్గుగా లేదా అంటూ అంబటి ప్రశ్నించారు.