దారి తప్పుతున్న నన్నే కాదు.. రాష్ట్ర ప్రజలను కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కరెక్ట్ దారిలో నడిపిస్తున్నారని ప్రముఖ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు అన్నాడు. జనసేనాని పవన్ కల్యాణ్ హాజరైన విశాఖ వారాహి విజయభేరి సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేల మంది అభిమానుల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఆడాను. కానీ, ఇంత మంది జనాల మధ్య రాజకీయ సభలో మాట్లాడటం ఇదే తొలిసారి. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మొదట పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే... నన్ను తప్పుదారి నుంచి తప్పించి ఈ రోజు కరెక్ట్ రూట్లో తీసుకెళుతున్నందుకు థాంక్యూ సర్. తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడ్నే కాదు... రాష్ట్ర ప్రజలందరినీ తప్పిస్తున్నారు పవనన్న.
మనం యువత 50 శాతం ఉన్నాం. యువతే రాష్ట్ర భవిష్యత్తు. పవనన్న నాయకత్వంలో కూటమి ద్వారా రాష్ట్రం మరింత ముందుకెళుతుందని, ఎంతో అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ప్రజలందరూ కూటమికి తోడ్పాటు అందించాలి. కసిగా ఓటేసి వైసీపీ అరాచకాలకు అంతం పలకాలి అంటూ పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికలు ప్రజలకు ఒక సువర్ణావకాశం. ముఖ్యంగా వైజాగ్ ప్రజలు ట్రెండ్ సెట్ చేయాలి. ఎన్నికల్లో కూటమి గెలిస్తే విశాఖ ఒక మహానగరం అవుతుంది. బీజేపీ సహకారంతో ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా మనందరి భవిష్యత్తు నెంబర్ వన్‌గా ఉండబోతోంది.
వైసీపీలో నేను 7 నెలల పాటు రాష్ట్రమంతా పర్యటించాను. గ్రామగ్రామాలకు వెళ్లాను. అక్కడ ఎన్నో సమస్యలు కనిపించాయి. వైసీపీ వల్ల ఆ సమస్యలు పరిష్కారం కావు అనిపించింది. వైసీపీలో బానిసత్వం తప్ప ఏమీ లేదు. పూర్తి అరాచకత్వం ఉంది. ఒక రాజు మిగతా అందరినీ తన కాలి కింద పెట్టి, రాష్ట్రాన్ని బానిసత్వానికి గురిచేస్తున్నాడు. అందుకే అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
పవనన్నను నమ్మండి. నాకు పవనన్నపై గట్టి నమ్మకం ఉంది. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ కూటమి ఉన్నా, ఎట్లాంటి మేనిఫెస్టో ఉన్నా పవనన్న మీకోసం నిలబడతారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అన్న కరెక్ట్ రూట్లో తీసుకెళతారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను అని అంబటి రాయుడు పిలుపునిచ్చారు.