ఇక్కడ పని దొరకక పస్తులుండరెవ్వరూ : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

సోమవారం, 15 జూన్ 2020 (18:56 IST)
కూలీలతో పాటు పలుగు పట్టిన కలెక్టర్ గంధం చంద్రుడు
ఉపాధి హామీ పథకం అమలులో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది అనంతపురం జిల్లా. దేశంలోనే అత్యధిక పనిదినాలను కల్పిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తోంది. వెనకబడిన ప్రాంతంగా అన్నార్తుల రోదనలతో మిన్నంటిన అనంతరపురం అనేది నాటి మాటగా మిగిలిపోయింది. ఇప్పుడు వేలాది మందికి పని కల్పిస్తూ దేశానికే ఆదర్శంగా జీవనోపాధికి మార్గం వేసింది.
 
కరోనా రక్కసి కాటుతో ప్రపంచం అట్టుడుతున్న నేపధ్యంలో దాదాపు ముప్పైవేల మంది వలస కూలీలు పొట్ట చేతపట్టుకుని అనంతపురంలోని స్వస్థలాలకు తిరిగి చేరుకోగా వారందరికీ మేమున్నామంటూ జిల్లా యంత్రాంగం అండగా నిలిచింది. కష్టం విలువ తెలిసిన జిల్లా పాలనాధికారి గంధం చంద్రుడు ముందుచూపుతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఫలితంగా అక్కడి స్ధానికులతో పాటు, తిరిగి స్వస్థలాలకు చేరిన వలస కూలీలు పట్టెడన్నం తినగలుగుతున్నారు. ఇటు రాష్ట్రంలోనూ, అటు జాతీయ స్థాయిలోనూ ఉపాధి హామీ పథకంను సమర్ధవంతంగా వినియోగించుకుంటున్న అనంతపురం జిల్లాలో, తాజా గణాంకాల ప్రకారం అనునిత్యం ఆరు లక్షల పైగా కూలీలు ఉపాధికి బాటలు వేసుకుంటున్నారు.
 
ఇప్పుడు జిల్లాలో ఏ ఒక్కరికీ పనిలేదన్న భాధ లేదు. పని కావాలనుకున్న వారు సమూహంగా ఏర్పడి స్ధానిక యంత్రాంగం దృష్టికి తీసుకు వస్తే చాలు. తక్షణమే స్పందిస్తున్న అధికార గణం వేగంగా ముందడుగు వేస్తున్నారు. గత సంవత్సర గణాంకాల మేరకు ఈ సంవత్సరం ఉపాధి హామీ పథకం పని దినాలను సిద్ధం చేసుకోగా, ప్రస్తుత డిమాండ్ అంతకు భిన్నంగా ఉండటంతో వెంటనే తగిన సమాలోచన చేస్తున్న అధికారులు అడిగిన వారికి లేదనకుండా ఉపాధిని చూపుతున్నారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రతి రోజూ ఉపాధి కోరుతున్న వారి సంఖ్యను పరిశీలిస్తూ, కొత్త పనులకు అనుమతులు మంజూరు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు.
 
జిల్లా పాలనాధికారిగా ఆదేశాలకే పరిమితం కాకుండా తానే స్వయంగా క్షేత్రస్ధాయిలో పరిశీలించి ఉపాధి కూలీల బాగోగులు తెలుసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన వారందరికీ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించే క్రమంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన ఉమ్మడి కృషి ప్రస్తుత సత్ఫలితాలకు కారణం అయ్యింది. కూలీలకు ఎంత పని కావాలంటే అంత పని చూపించేలా జిల్లా అధికారులను అప్రమత్తం అయ్యారు. సంవత్సరం పొడవునా నిరంతరంగా 365 రోజుల పాటు ఉపాధి పనులు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి గంధం చంద్రుడు వివరించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ 6 లక్షలకు పైబడి కూలీలు పనిచేస్తున్నారని, ఇంత పెద్ద ఎత్తున పనులు కల్పించిన ఏకైక జిల్లా అనంతపురం మాత్రమేనని కలెక్టర్ వివరించారు. తమ జిల్లా తరువాతి స్థానంలో ఐదున్నర లక్షల పైబడిన ఉపాధి హామీ దినాలతో విజయనగరం ద్వితీయ స్థానంలో ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఐదు లక్షల పనిదినాలతో తృతీయ స్థానాన్ని పొందిందన్నారు. మరోవైపు ఉపాధి హామీ ద్వారా జిల్లాలో 80,138 ఆస్తులు సృష్టించబడ్డాయని ఇంత పెద్దఎత్తున మరెక్కడా లేదని వివరించారు.
 
రాష్ట్రంలో సగటు కూలి రూ.230.29 నమోదు అవుతుండగా, అనంతపురంలో అది మరో మూడు రూపాయలు ఎక్కువగా రూ.233.47గా ఉందన్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజుల పాటు పనులు కల్పిస్తామని, అవసరమైతే మరిన్ని రోజులు ఉపాధి పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు గ్రామాలకు దగ్గర్లోనే ఉపాధి పనులు చూపే ప్రయత్నం చేయటమే కాక, ఆ ప్రాంతంలో తాగేందుకు తాగునీరు, చేతులు కడుక్కునేందుకు సబ్బులు సమకూర్చేలా మండల స్థాయి అధికారులు ఆదేశాలు ఇచ్చామన్నారు.
 
ఈ నేపధ్యంలో స్వయంగా పలుగు, పార చేతబట్టి ఉపాధి కూలీగా మారారు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. ఉపాధి కూలీలలో ఒకరుగా కలిసిపోయి, మాటామంతి కలిపి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకోవటమే కాక వారిలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేసారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తామని భరోసా నిచ్చారు.
 
ఇటీవల బత్తలపల్లి మండలం వేల్పుమడుగు గ్రామం వద్ద చేపడుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి తనిఖీ చేసిన కలెక్టర్ వారి పనివిధానంపై ఆరా తీసారు. ప్రతిరోజు పనులకు వస్తున్నారా, ఎన్ని గంటలకు వచ్చి వెళ్తారు, ఇతర పనులకు వెళ్తే ఎంత డబ్బులు వస్తాయి, ఇక్కడ ఎలా ఇస్తున్నారు, డబ్బు సక్రమంగా అందుతోందా అంటూ ఆప్యాయంగా వారిని పలకరించారు.
 
వ్యవసాయ పనులకు వెళ్తే రోజుకి 150 రూపాయలు కూలీ మాత్రమే ఇస్తున్నారని, ఉపాధి పనులకు వస్తే ప్రతి రోజు 240 రూపాయల దాకా డబ్బులు వస్తున్నాయని నారాయణమ్మ(60) అనే మహిళా కార్మికురాలు కలెక్టర్‌కు వివరించారు. బయటి పనులలో రోజంతా చాకిరి చేయవలసి వచ్చేదని, ఉపాధి పనులలో ఉదయం ఆరుకి వచ్చి పదకొండు గంటలకు వెళ్లిపోతున్నామని కూలీలు కలెక్టర్‌కు తెలియజేశారు. బీరమ్మ (40) మాట్లాడుతూ తాను ఇటీవలి వరకు కేరళలో పనిచేసానని, యజమానుల అగౌరవంతోనే కాలం గడిచిపోయిందని, ఉపాధి హామీ పథకం పుణ్యమా అని గౌరవంగా బ్రతకగలిగే అవకాశం వచ్చిందని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ లింగ వివక్ష లేకుండా కుటుంబ సభ్యులు అందరూ పనిచేసుకోవచ్చని, ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకుంటే కుటుంబానికి మెరుగైన ఆదాయం లభిస్తుందన్నారు.
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గనిర్దేశకత్వంలో వేగంగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ సైతం, జాతీయ స్థాయిలో అత్యధిక పనిదినాలను నమోదు చేసింది. అందుబాటులో ఉన్న గణాంకాలను అనుసరించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదిన్నర కోట్ల పనిదినాలను కల్పించటం ద్వారా దేశంలో అగ్రగామిగా నిలిచింది. తరువాతి స్థానంలో ఆరు కోట్ల పనిదినాలతో రాజస్తాన్ ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు