ఈఎంఐలపై మారటోరియం సరే.. వడ్డీల సంగతేంటి : సోనియా ప్రశ్న

గురువారం, 2 ఏప్రియల్ 2020 (15:13 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం లాక్‌డౌన్‌లో ఉంది. దీంతో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు ఇతర అన్ని రకాల రుణాలపై మూడు నెలల పాటు మారటోరియాన్ని భారత రిజర్వు బ్యాంకు విధించింది. ఇంతవరకుబాగానే ఉంది. అయితే, ఈ మూడు నెలల కాలానికి వడ్డీని మాత్రం వసూలు చేస్తామని పలు బ్యాంకులు ప్రకటించాయి. 
 
దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. హౌసింగ్, వ్యక్తిగత అవసరాలు, ఆటోమొబైల్, ఇతరత్రా అంశాలపై మూడు నెలల పాటు ఈఎంఐలను వాయిదా వేశారని, కానీ వాటిపై వడ్డీ రాయితీని ఎందుకు ప్రకటించలేదని ఓ ప్రకటనలో ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు.
 
ప్రస్తుతం పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అన్నిరంగాల్లో వేతనాల కోత, ఉద్యోగాల్లోంచి తీసివేతలు, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, గ్యాస్ అధికధరలు వంటివి వారిని ఉన్నపళాన కుంగదీస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు, ఈఎంఐలు వాయిదా వేసినా వడ్డీ రాయితీ మాత్రం ప్రకటించలేదు. వడ్డీ రాయితీ ప్రకటించకపోతే మీరు ఈఎంఐలు వాయిదావేసినా ప్రయోజనం లేదు అని ఆమె అభిప్రాయపడ్డారు. 
 
అంతేకాకుండా, ఇపుడు ప్రతి ఒక్కరి ముందు అతిపెద్ద సవాల్ ఉందన్నారు. కానీ దాన్ని అధిగమించాలంటే, మ‌నం మ‌రింత ప‌ట్టుద‌ల‌తో ఉండాల‌న్నారు.  కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వ‌ల్ల మ‌న దేశంలో పేద ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నార‌ని, వెనుక‌బ‌డిన వ‌ర్గాల ప‌రిస్థితి కూడా అయోమ‌యంగా ఉంద‌న్నారు. అంద‌రం క‌లిసి వీరంద‌రినీ ఆదుకోవాల‌ని సోనియా పిలుపునిచ్చారు. 
 
పేద‌ల‌కు కావాల్సిన మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్నారు. అప్ర‌ణాళికాబ‌ద్ధంగా అమ‌లు చేస్తున్న లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డుతున్న‌ట్లు ఆమె చెప్పారు. గురువారం ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం జరిగింది. ఇందులో సోనియా మాట్లాడుతూ, లాక్‌డౌన్ అవ‌స‌ర‌మే అయినా.. ల‌క్ష‌లాది మంది వ‌ల‌స కూలీల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు