మరో హామీని నెరవేర్చిన జగన్.. ఆశా వర్కర్ల జీతాలు భారీగా పెంపు

సోమవారం, 3 జూన్ 2019 (17:58 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మరో హామీని నెరవేర్చారు. తన పాదయాత్ర సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు వారి నెలసరి వేతనాలను రూ.3 వేల నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంచారు. అంటే 300 శాతం పెంచారు. 
 
సోమవారం సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్యఆరోగ్య శాఖపై  సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత ఆశావర్కర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పైగా, వైద్య ఆరోగ్య శాఖను స్వయంగా తానే పర్యవేక్షిస్తారనని అధికారులకు చెప్పారు. 
 
అదేసమయంలో వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేసేందుకు 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని, తన తండ్రి స్ఫూర్తికి అనుగుణంగా 108, 104 వైద్య సేవలు ఉండాలని కోరారు. అలాగే, ఎన్టీఆర్ వైద్య సేవలను ఇకపై వైఎస్ఆర్ వైద్య సేవలుగా మార్చారు. 
 
మరోవైపు, ఆర్థిక వనరులను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్డింగుల నుంచి గ్రీన్ టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఇక ముందు రాష్ట్రంలో 5 వేల చదరపు అడుగుల వైశాల్యం మించి నిర్మించే భవనాల మీద ఈ పన్ను పడుతుంది. చదరపు అడుగుకు రు. 3 చొప్పున ఈ టాక్స్ వసూలు చేయాలని గనుల శాఖ మీద జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. 
 
అలాగే, మైనింగ్ కోసం లీజుకు తీసుకున్న క్వారీలను వేరొకరికి బదిలీ చేయడాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనింగ్ లీజుల బదిలీలతో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుబంధ పరిశ్రమలు ఉన్న క్వారీలను మాత్రమే బదలాయించుకునేందుకే అనుమతివ్వాలని నిర్ణయించారు.
 
అదేవిధంగా ప్రస్తుతం 20 ఏళ్లుగా ఉన్న మైనింగ్ లీజు కాలాన్ని అనుబంధ పరిశ్రమలు పెడితే 30 ఏళ్లకు పెంచాలని సూచించారు. ఆర్థిక వనరులను పెంచుకునేందుకు జగన్ ప్రభుత్వం 'గార్బేజ్ టాక్స్' కూడా వసూలు చేయాలని నిర్ణయించింది. దీనిపై సమగ్ర నివేదికను తయారుచేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు