నేడు ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ!!

సెల్వి

శనివారం, 6 జులై 2024 (08:37 IST)
సుధీర్ఘకాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్య పరిష్కారం కోసం ఈ  సీఎంలు సమావేశంకావాలని నిర్ణయించారు. ఇందుకు హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ వేదికకానుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ  భేటీ జరగనుంది. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఇందులో విభజన సమస్యలు, రెండు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పెండింగులో ఉన్న అంశాలపై చర్చించనున్నారు. 
 
మరోవైపు, ఈ సమావేశం కోసం ఆయన శుక్రవారం సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నాయకులు హైదరాబాద్‌ నగరంలో పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో పలు రోడ్లపై చంద్రబాబుకు స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఆహ్వాన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్గా మారాయి. మరోవైపు, ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. 
 
ఢిల్లీ పర్యటన ముగియడంతో ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రజా భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమవుతారు. హైదరాబాద్ నగరమంతా చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇది మొదటిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని సంస్థల విభజనపై చర్చించే అవకాశముంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. తమకు ఏపీ ప్రభుత్వం రూ.24 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతుండగా, తమకే రూ.7 వేల కోట్లు వస్తాయని ఏపీ చెబుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు