ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనబాటపట్టారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన వేతన సవరణ స్కేలు (పీఆర్సీ)ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు.. తమకు పాత జీతాలనే ఇవ్వాలని కోరుతూ ఉద్యమబాట పట్టారు. ఈ నెల 7వ తేదీ వరకు దశల వారీగా వివిధ రకాలైన ఆందోళనలు చేపట్టి ఏడో తేదీ నుంచి సమ్మెను ప్రారంభించాలని నిర్ణయించారు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ అర్థరాత్రి నుంచి ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగాల సంఘాలన్నీ సమ్మెకు వెళ్తున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ మంత్రుల కమిటీ సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. అయితే, మంత్రుల కమిటీ భేటీకి కూడా వెళ్లకూడదని ప్రభుత్వ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు.
పీఆర్సీ జీవోలను రద్దుతో పాటు అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని, అలాగే, పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని వీటికి సమ్మతిస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు.