వైసీపీ నేతల పాపాలకు అధికారులు బలి.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:32 IST)
కోర్టు ధిక్కరణ కేసులో ఆగ్రహానికి గురైన 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించిన వైనం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
వైసీపీ నేతల పాపాలకు అధికారులు బలవుతున్నారన్న అర్థం వచ్చేలా నాగబాబు చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు కోర్టు శిక్షకు గురయ్యారని తెలిసిందని, అయితే, ఇందులో అధికారుల పాత్ర ఏమీ ఉండదని నాగబాబు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాలు నిర్మించాలని అధికారులు తీర్మానించి ఉండరని అభిప్రాయపడ్డారు.
 
అవన్నీ వైసీపీ ప్రజాప్రతినిధుల నిర్ణయాలే అయి ఉంటాయని అభిప్రాయపడ్డారు. కోర్టు శిక్షకు గురైన 8 మంది ఐఏఎస్‌లు మంచి సమర్థులైన అధికారులేనని కితాబిచ్చారు. 
 
వైసీపీ పాలనలో సమాజానికి, రాజ్యాంగానికి సంరక్షకులు(వాచ్ డాగ్స్)గా ఉండాల్సిన అధికారులు వైసీపీ మాయలో పడిపోయారని షాకింగ్ కామెంట్లు చేశారు. వారంతా ఇప్పుడు వైసీపీ పెంపుడు జంతువులు (పెట్స్)గా మారిపోయారంటూ నాగబాబు సంచలన ఆరోపణలు గుప్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు