తట్టాబుట్టా సర్దేయండి.. సీఆర్డీయేకు సూచన.. 26 నుంచి ప్రజావేదిక కూల్చివేత

మంగళవారం, 25 జూన్ 2019 (14:18 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో కృష్ణానది కరకట్టను ఆనుకుని నిర్మించిన ప్రజా వేదికను ప్రభుత్వం కూల్చివేయనుంది. ఈ వేదికలో సోమవారం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సు జరుగుతోంది. ఇందులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ భవనం కూల్చివేతకు ఆదేశాలు జారీచేశారు. 
 
దీంతో ప్రజా వేదికలో ఉన్న అన్ని రకాల వస్తువులను శరవేగంగా తరలించాలని సీఆర్డీయేకు రెవెన్యూ శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా వేదిక భవనంలో ఉన్న ఫర్నీచర్, ఏసీలు, ఇతరాత్రా వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న కలెక్టర్ల సదస్సు ముగియగానే కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. పరిపాలనా యంత్రాంగంతో నిర్వహించబోయే సమావేశాలకు రాజధానిలోనే వేదికను నిర్మించాలని రెవెన్యూ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ అంగీకారం తెలిపిన అనంతరం కొత్త వేదిక నిర్మాణం మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ప్రజావేదిక నిర్మాణంతో పాటు కరకట్టపై ఉన్న ఇతర కట్టడాలను కూడా కూల్చేస్తారా లేక ప్రజావేదిక మాత్రమే పడగొడతారా అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు