పోలవరంలో దోపిడి.. ఇంకో 20 రోజులే - అన్ని బయటపడతాయి: సీఎం జగన్

శుక్రవారం, 19 జులై 2019 (13:14 IST)
పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ అసెంబ్లీలో సుధీర్గ చర్చ జరిగింది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిణామంతో సభలో గందరగోళం నెలకొంది. 
 
దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు గోదావరిలో వరదలు వస్తాయన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం స్పీల్‌వేను పక్కనబెట్టి.. కాపర్ డ్యాం నిర్మాణానికే అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని జగన్ గుర్తుచేశారు.
 
నవంబర్‌లో పనులు ప్రారంభించి 2021 జూన్ నాటికి నీళ్లిస్తామని జగన్ స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్ వల్ల దాదాపు 15 శాతం వరకు నిధులు మిగులుతాయన్నారు. 
 
సబ్ కాంట్రాక్ట్‌ల ముసుగులో బంధువులు, అనుచరులకు పనులు కట్టబెట్టారని... యనమల వియ్యంకుడికి సబ్‌కాంట్రాక్ట్ ఇచ్చారని, కానీ ఇంతవరకు పనులు మొదలు కాలేదని జగన్ సభలో ప్రకటించారు. 
 
ఏం జరగకుండానే రూ.724 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారని జగన్ ఆరోపించారు. నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత 15, 20 రోజుల్లో అన్నీ బయటకు వస్తాయని సీఎం వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు