నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం : సినిమా టిక్కెట్ల విక్రయంపై నిర్ణయం

గురువారం, 28 అక్టోబరు 2021 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. 
 
ముఖ్యంగా, తెలుగు చిత్రపరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించే సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఈ సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. తద్వారా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే విధానాన్ని అమల్లోకి తీసుకునిరానున్నారు. ఈ ఒక్కదానికోసమే సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తుండటం గమనార్హం. 
 
మరోవైపు, టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం కూడా చట్ట సవరణ చేయనున్నారు. దీనిపైనా నేటి క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణకు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కూడా ఈ భేటీలో ఆమోద ముద్ర పడనుంది. 
 
దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజు అంశం చట్ట సవరణ, దేవాదాయశాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై చర్చించనున్నారు. వచ్చే నెల 15, 16 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు