ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆగివున్న టిప్పర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది గాయపడ్డారు. ఈ ప్రధాని శుక్రవారం వేకువజామున జరిగింది. చిత్తూరు జిల్లా శివారు గంగాసాగరం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తిరుపతి నుంచి మదురైకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఉన్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సు 20 అడుగులు జారుకుంటా రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోని విద్యుత్ స్తంభాన్ని బస్సు ఢీకొట్టింది. దీంతో కరెంట్ స్తంభం బస్సులోకి చొచ్చుకునివచ్చింది. దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మరో 16 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.