హైదరాబాద్‌ టు అమరావతి : సైకిల్‌‌పై బయలుదేరిన ఏపీ ప్రభుత్వ మహిళా ఉద్యోగి.. 26 రాత్రికి చేరిక!

శుక్రవారం, 24 జూన్ 2016 (15:14 IST)
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కొత్తశోభ సంతరించుకుంటుంది. దీనికి కారణం.. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులంతా అమరావతికి తరలివస్తున్నారు. దీంతో రాజధాని ప్రాంతమంతా సందడిసందడిగా మారిపోయింది. 
 
మరోవైపు.. ఉద్యోగుల విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఉద్యోగులు శాఖల వారీగా అమరావతికి దశలవారీగా వస్తున్నారు. ఇందులోభాగంగా, సహకార, వాణిజ్య, సమాచార శాఖకు చెందిన ఉద్యోగులు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో విజయవాడకు చేరుకున్నారు. 
 
వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న అధికారిణి పద్మ తన ప్రయాణాన్ని భిన్నంగా ఎంచుకున్నారు. ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపాలని అందరిలా కాకుండా సైకిల్‌పై అమరావతి బయల్దేరారు. ఆమె సైకిల్ ప్రయాణాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘం నేతలు అశోక్‌బాబు, కృష్ణయ్య తదితరులు జెండా ఊపి ప్రారంభించి, పద్మకు అభినందనలు తెలిపారు.
 
అలా సైకిల్‌పై అమరావతికి హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఈనెల 26వ తేదీ రాత్రికి చేరుకోనున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ... ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపేందుకే తాను ఇలాంటి సాహసానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. అదేసమయంలో అమరావతి ప్రజలు కూడా తమకు అన్ని విధాలా సహకించాలని ఆమె విజ్ఞప్తిచేశారు. 

వెబ్దునియా పై చదవండి