ఎస్ఈసీకి సహకరించడం లేదు.. కోర్టు ఉత్తర్వులు పక్కాగా అమలు చేయలేదు..

మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (09:18 IST)
ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర పంచాయతీ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిల తీరును హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహాయ, సహకారాలు అందించాలని ఆదేశిస్తూ గతంలో తామిచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. 
 
ముఖ్యంగా, ఎస్‌ఈసీకి మంజూరైన పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోలేదని, నిధులు మంజూరు చేయలేదని ఆక్షేపించింది. కోర్టు ఉత్తర్వులను అధికారులు సరైన స్ఫూర్తితో అమలు చేయలేదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని తొలుత ఆదేశించింది. 
 
అయితే, వారు కోర్టుకు హాజరుకాలేరని, రాతపూర్వకంగా వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ అఫిడవిట్లు వేసేందుకు నాలుగు వారాలు గడువిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఆదేశాలు జారీచేశారు. 
 
ప్రధానంగా నిధుల కేటాయింపు, ఖాళీ పోస్టుల భర్తీ, తదితర విషయాల్లో ఎస్ఈసీకి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతేడాది నవంబర్‌ 3న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం సహకరించలేదంటూ ఎస్‌ఈసీ హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ జరుగగా, కోర్టు అక్షింతలు వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు