ఆన్‌లైన్ ఇంటర్ అడ్మిషన్లు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

మంగళవారం, 13 జులై 2021 (11:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ కోర్సుల ప్రవేశాలను ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని నిర్ణియించింది. దీంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనుంది. 
 
కరోనా సెకెండ్ వేవ్ కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు కావడంతో అందర్ని పాస్ చేశారు. ఆ తరువాత తరగతులకు విద్యార్థులను ఎలా అనుమతించాలి అనేదానిపై కసరత్తు చేస్తోంది. 
 
2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు సన్నాహాలు పూర్తి చేసింది. పారదర్శకతతో మెరిట్‌ ప్రాతిపదికన విద్యార్థులు కోరుకున్న కాలేజీలలో, నచ్చిన గ్రూపులో సీటు పొందేలా వీలు కల్పించనుంది.
 
ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఇంటర్‌ బోర్డు గత విద్యా సంవత్సరంలోనే ప్రారంభించింది. అయితే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. 
 
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు నిర్వహించేందుకు లైన్‌క్లియర్‌ కావడంతో ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు వీలుగా గతేడాది ఇంటర్‌ బోర్డు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త కాలేజీల అనుమతులు, రెన్యువల్‌కు ఆన్‌లైన్‌ అప్లికేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు