కావలి పట్టణంలో కరోనా మరణ మృదంగం.. 10 రోజుల లాక్డౌన్

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:37 IST)
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగిస్తోంది. దీంతో ఒక్క రోజే ఏకంగా ఏడుగురు వ్యాపారులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కావలి పట్టణ ప్రజలంతా స్వచ్చంధంగా లాక్డౌన్ పాటించాలని నిర్ణయించారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతున్న విషయం తెల్సిందే. రోజుకు పదివేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కరోనా వైరస్ నెల్లూరు జిల్లాలో సైతం పంజా విసురుతోంది. జిల్లాలోని కావలిలో ఏకంగా ఏడుగురు వ్యాపారులు కారోనా కారణంగా మృతి చెందడంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి వ్యాపార వర్గాలు సిద్ధమయ్యాయి. 
 
శనివారం నుంచి ఏకంగా పది రోజుల పాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలంతా తమ వంతుగా లాక్డౌన్‌కు సహకరించాలని విన్నవించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు