అనకాపల్లి పూడిమడక తీరంలో ఏడుగురు విద్యార్థుల గల్లంతు

శుక్రవారం, 29 జులై 2022 (21:39 IST)
అనకాపల్లి జిల్లాలో విషాదం జరిగింది. పూడిమడక సముద్రతీరంలో ఏడుగురు విద్యార్థుల గల్లంతయ్యారు. వీరంతా సముద్ర స్నానానికి వెళ్లి కనిపించకుండా పోయారు. వీరంతా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు కనిపించకుండా పోయారు. ఈ ఘటనలో చనిపోయిన గుడివాడ పవన్ సూర్యకుమార్‌ మృతదేహం లభ్యమైంది. 
 
ఇక జాలర్లు రక్షించిన సూరిశెట్టి తేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన ఐదుగురి కోసం కోస్ట్‌ గార్డ్స్‌, మెరైన్ సిబ్బంది గాలిస్తున్నారు. గల్లంతైన విద్యార్థులను గోపాలపట్నానికి చెందిన జగదీశ్‌, నర్సీపట్నం వాసి జశ్వంత్‌, మునగపాకకు చెందిన గణేశ్‌, ఎలమంచిలికి చెందిన రామచందు, గుంటూరు విద్యార్థి సతీశ్‌గా నిర్ధరించారు. 
 
డీఐఈటీ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొత్తం 15 మంది విద్యార్థులు పూడిమడక బీచ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో గల్లంతైన వారి వివరాలను పరిశీలిస్తే, జగదీష్ (గోపాలపట్నం), జశ్వంత్ (నర్సీపట్నం), సతీష్ (గుంటూరు), గణేష్ (మునగపాక), చందు (యలమంచిలి)లు ఉన్నారు. 
 
కాగా, ఈ ఘటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. సముద్ర స్నానాలకు వెళ్లి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే, అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో జరిగిన విషాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. విద్యార్థుల గల్లంతుపై సీఎం జగన్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయ చర్యలు పర్యవేక్షించాలని.. మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు