BITS Campus in Amaravati అమరావతికి మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ

ఠాగూర్

గురువారం, 5 డిశెంబరు 2024 (10:38 IST)
ఏపీ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ రానుంది. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన క్యాంపస్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని పిలానీలో ఉన్న బిట్స్ విద్యాలయానికి ఇప్పటికే గోవా, హైదరాబాద్, దుబాయ్‌లలో క్యాంపస్‌లు ఉండగా, తాజాగా ఏపీ రాజధానిలోనూ క్యాంపస్ ఏర్పాటుకు మొగ్గు చూపుతుంది. 
 
కాగా, రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో పాటు అమరావతిలో రాజధాని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది. దీంతో గత ఐదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. 
 
ఈ క్రమంలో అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు, సంస్థలు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఇందులోభాగంగానే బిట్స్ క్యాంపస్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని సౌకర్యాలతో కలిసి 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. 
 
ఇందుకోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. బిట్స్ ప్రతినిధులు బుధవారం సీఆర్డీఏ అధికారులతో కలిసి కురగల్లలోని ఎస్ఆర్ఎం సమీపంలో, వెంకటరాయపాళెంలోని బైపాస్ వద్ద స్థలాలను పరిశీలించారు. యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బిట్స్ ప్రతినిధులు, సీఆర్డీయే అధికారులకు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు