రైతులకు మరో శుభవార్త.. ఉచితంగా బోర్లు : సీఎం జగన్

మంగళవారం, 26 మే 2020 (18:20 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రైతులకు మరో శుభవార్త చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని తెలిపారు.  'మన పాలన-మీ సూచన' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది చివరికల్లా గ్రామాల్లో జనతా బజార్లను ఏర్పాటు చేస్తామన్నారు. 
 
ముఖ్యంగా రైతులు పండించే పంటలో 30 శాతం దిగుబడిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఇందుకోసం గ్రామ సచివాలయం సమీపంలో జనతా బజార్లను ఏర్పాటు చేస్తామన్నారు. 
 
దళారీ వ్యవస్థను తొలగించేందుకు తీసుకొచ్చిన రైతు భరోసా సెంటర్ల ద్వారా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని తెలిపారు. రైతు భరోసా సెంటర్లలో కియోస్క్‌లు, ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
 
రైతులు, రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే తమ లక్ష్యమన్నారు. గిట్టుబాటు ధర లభించినప్పుడే రైతులకు లాభసాటిగా ఉంటుందని  తెలిపారు. రైతు భరోసా - పీఎం కిసాన్ ద్వారా రూ.13,500 పంటసాయాన్ని అందిస్తున్నామన్నారు. రైతులకు వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమల్లోకి  తీసుకొచ్చామని తెలిపారు. 
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించినట్టు గుర్తుచేశారు. గతప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలకు.. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకున్నట్టు చెప్పారు. 
 
ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందిస్తామని, వ్యవసాయానికి అవసరమైన సూచనలు, సలహాలు కూడా ఆర్‌బీకేలు అందిస్తాయని తెలిపారు. ఆర్‌బీకేల ద్వారా ఈక్రాపింగ్‌ విధానాన్ని అమలు చేస్తామని, పంటలు వేయడానికి ముందే గిట్టుబాటు ధరలను ప్రకటిస్తామని సీఎం జగన్ తెలిపారు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు