బీజేపీలోకి గంటా శ్రీనివాస రావు .. అవంతి శ్రీనివాస్ ఏమన్నారు?

శనివారం, 22 జూన్ 2019 (10:28 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరారు. ఈ హఠాత్పరిణామంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖంగుతిన్నారు. బీజేపీతో స్నేహసంబంధాల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీతో తెగిపోయిన సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకునేందుకు సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను చంద్రబాబే పంపించారంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. 
 
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఎదుర్కోలేకపోతున్నారన్నారు. అందుకే టీడీపీ నేతలను బీజేపీలకి పంపుతున్నారని ఆరోపించారు. 
 
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావును కూడా త్వరలోనే బీజేపీలోకి పంపుతారని, ఈ విషయంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అవంతి అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. 
 
ఎన్నికల తర్వాత చంద్రబాబు తమ వద్దకే వస్తారన్న అమిత్ షా వ్యాఖ్యలను ఈ సందర్భంగా అవంతి గుర్తు చేశారు. అమిత్ షా వ్యాఖ్యల ఇప్పుడు నిజం అవుతున్నాయని, బీజేపీలోకి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు