నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. పార్లమెంటులో తన గళం విప్పిన రెబల్ ఎంపీ రఘరామపై, హౌస్ లో సాటి వైసీపీ ఎంపీలు మాటల దాడికి దిగారు. ఆయన్ని బూతులు తిట్టడమే కాకుండా, ఎంపీ రఘరామ బీజేపీలోకి వెళుతున్నాడని ఆరోపించారు. దీనిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగానే స్పందించారు.
రఘురామను అసలు మీరెందుకు పార్టీలో చేర్చుకున్నారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. రఘురామకృష్ణ రాజు బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఓ ఎంపీ పార్లమెంటులో మాట్లాడాడని వెల్లడించారు. రఘురామకృష్ణ రాజు అవినీతిపరుడని, బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడిన వ్యక్తి అని, ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము కేంద్రాన్ని కోరామని ఆ ఎంపీ ప్రస్తావించినట్టు సోము తెలిపారు.
"రఘురామకృష్ణరాజు అవినీతిపరుడు అయితే ఆయనకు సీటు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా. ఈ అవినీతి అంతా ఆయన ఈ మధ్యకాలంలోనే చేశాడా? 2014కి ముందు ఆయన మీ పార్టీలోనే ఉన్నారు. 2014లో బీజేపీలో చేరారు. కానీ మేం రఘురామకు సీటివ్వలేదు, గోకరాజు గంగరాజుకు ఇచ్చాం. ఇవాళ మీరు ఆయనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2019లో మీరే ఆయనను పార్టీలో చేర్చుకుని మరీ సీటిచ్చారు. మేం ఎందుకివ్వలేదు? మీరు ఎందుకిచ్చారు? ఒకసారి ఆలోచించండి" అంటూ సోము వీర్రాజు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.