చంద్రన్న కానుకపై ఆరా : సీబీఐ విచారణకు ఏపీ సర్కారు నిర్ణయం!!

గురువారం, 11 జూన్ 2020 (14:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అపుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన చంద్రకానుకపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 
 
గురువారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక అందజేసింది. సబ్‌కమిటీ నివేదిక కేబినెట్‌ ముందు ఉంచింది. సబ్‌కమిటీ సూచన మేరకు సీబీఐ విచారణకు ఆదేశించింది. 
 
అదేసమయంలో వైఎస్సార్‌ చేయూత పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50 వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆగస్టు 12వ తేదీన ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 
 
రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని దశలవారీగా చేపట్టాలని తీర్మానం చేశారు. రామాయపట్నం పోర్టుకు ఆగస్టు నాటికి టెండర్లు పిలవనున్నారు. రామాయపట్నం పోర్టు టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. డిస్కం, ట్రాన్స్‌కోలకు రూ.6 వేల కోట్ల ఆత్మనిర్భర్‌ భారత్‌ నిధులు ఖర్చు చేయనున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ నెల 16వ తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు