ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టాలంటే పెద్ద పరీక్షే!

గురువారం, 11 జూన్ 2020 (11:21 IST)
కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ఓ పెద్ద పరీక్షలా మారింది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు సడలించినా... అంతర్రాష్ట్ర ప్రయాణాల అంశాన్ని రాష్ట్రాలకే వదిలేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 
 
ప్రధానంగా మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్తున్న ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న చాలామంది ఏపీ వాసులు.. లాక్డౌన్‌ సడలింపుల నేపథ్యంలో స్వస్థలాలకు బయల్దేరుతున్నారు. కానీ, ఏపీలో అడుగుపెట్టడం అంత సులభంగా లేదు. 
 
ఆ రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన 'స్పందన' ద్వారా ఈ పాస్‌ తీసుకోవడంతోనే అసలు పరీక్ష మొదలవుతుంది. పాస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నాలుగోవంతు మందికి కూడా పాస్‌లు ఇవ్వట్లేదు. ఏదో ఒక కారణం చెప్పి తిరస్కరిస్తున్నారు. ఒకవేళ పాస్‌ తీసుకున్నా.. సరిహద్దుల్లో వైద్య చెక్‌పోస్టు పెట్టి, రాష్ట్రంలోకి వచ్చేవారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. 
 
రాష్ట్రంలో నాలుగు రోజులకు మించి ఉంటామంటే హోం క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నారు. ఇక, ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లు, విమానాల్లో వచ్చే ప్రయాణికులకు అధునాతన ఐమాస్క్‌ క్వారంటైన్‌ మొబైల్‌ బస్సుల ద్వారా 2 నిమిషాల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ అత్యాధునిక శాంపిల్‌ కలెక్షన్‌ బస్సులను విజయవాడ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌తోపాటు.. గరికపాడు చెక్‌పోస్టు వద్ద కూడా అందుబాటులో ఉంచారు. 
 
ఈ చెక్‌పోస్టు ద్వారా రోడ్డు మార్గంలో వచ్చేవారి పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండడంతో వాహనదారులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. అక్కడ.. పాసులు ఉన్నవారి అనుమతులు పరిశీలించి, థర్మల్‌ స్కానింగ్‌ చేస్తున్నారు. నాసికా స్రావాలను (స్వాబ్‌ టెస్ట్‌) సేకరిస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారనే దాని ఆధారంగా కొందరిని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు, మరికొందరిని హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు. 
 
ఉదాహరణకు.. ముంబైలాంటి నగరాల నుంచి, కట్టడి ప్రాంతాల నుంచి వచ్చేవారిని తప్పనిసరిగా ప్రభుత్వ క్వారంటైన్‌కు పంపుతున్నారు. ఇతర జోన్ల నుంచి వచ్చేవారిని హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు. తీసుకున్న నమూనాల్లో ఏదైనా పాజిటివ్‌ వస్తే.. సదరు వ్యక్తుల చిరునామా ప్రకారం వారిని గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు పంపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు