స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు ఈ నెల 29వ తేదీ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీన్ని ఏపీ సీఐడీ విభాగం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ మేరకు మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీమెన్స్, ఫోరెన్సిక్ నివేదికలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని అందువల్ల చంద్రబాబుకు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది.
కాగా, ఈ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయగా, ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజుల పాటు నిర్బంధించింది. ఆ తర్వాత ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా, ఈ నెల 29వ తేదీ నుంచి రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన వివిధ రకాలైన వైద్య పరీక్షలతో పాటు... నేత్ర పరీక్షలు చేయించుకుని ఇంటి పట్టున విశ్రాంతి తీసుకుంటున్నారు.
చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విన్న వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మధ్యంతర బెయిల్ షరతులు ఈ నెల 28వ తేదీకే వర్తిస్తాయని, ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టంచేసింది.
మరోవైపు, మద్యం అనుమతుల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. చంద్రబాబు తరపున న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం విచారనను బుధవారానికి వాయిదా వేసింది. రేపటి విచారణలో సీఐడీ తరపు వాదనలు ఆలకించనుంది.
గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా, కొల్లు రవీంద్రను ఏ2గా పేర్కొన్నారు. దీంతో వీరిద్దరూ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.