విజయవాడ : దుబారాను సహించను... ప్రభుత్వ కార్యక్రమాల్లో పొదుపును పాటించండి అంటూ ఉన్నతాధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. అధికారులంతా బాబు గారి మాటలను శ్రద్ధగా ఆలకించారు... సరే సర్... అంటూ తలలూపారు. తీరా పక్కకు వచ్చాక, కిసుక్కుమని నవ్వుకున్నారు. ఏంటంటే... అసలు శంకస్థాపనలు, పండుగల పేరుతో దుబారా చేస్తోందే సీఎం సాబ్ కదా... అని. అమరావతి శంకుస్థాపన పేరుతో రెండుసార్లు భారీ కార్యక్రమాలు పెట్టారు.
ప్రధానితో పాటు పలు దేశాల పెద్దలను పిలిచి ఘనంగా... భారీ ఎత్తున కార్యక్రమాలు చేశారు. తర్వాత తాత్కాలిక రాజధాని నిర్మాణం అని ఒకసారి... సంకల్ప దివస్ అని మరోసారి... ఇపుడు తాజాగా ఏపీ పరిపాలనా భవనాల శంకుస్థాపన అని మరోసారి భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమరావతిలోని రాయపూడి, లింగాయపాలెం, ఉద్ధండురాయుని పాలెంలో 900 ఎకరాల్లో ఏపీ పరిపాలనకు శాశ్వత భవనాలు నిర్మించాలని సంకల్పించారు. దీనికి ముఖ్యఅతిథిగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
లింగయపాలెం - రాయపూడి మధ్య రేపు జరగనున్న ఈ ప్రభుత్వ భవనాల సముదాయాల శంకుస్థాపన ప్రదేశంలో ఏర్పాట్లను మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమలు పర్యవేక్షిస్తున్నారు. దీనికి మరోసారి కేంద్ర పెద్దలతో భారీ ఖర్చుతో శంకుస్థాపనలు జరుగుతున్నాయన్న మాట. ఇన్నిసార్లు శంకుస్థాపనలు, అట్టహాసంగా కార్యక్రమాలు... మరోపక్క పుష్కరాల పేరుతో భారీ ఖర్చులు... ఇలా అదుపు లేకుండా ప్రభుత్వం చేస్తూ, తిరిగి తమకు పొదుపు పొదుపు అని ఉద్భోదించడం అధికారులకు నవ్వు తెప్పిస్తోంది.